న్యాయమైన ధర ఇవ్వాలని ధర్నా 1 m ago
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలకు వచ్చిన రైతులకు న్యాయమైన ధరలు ఇవ్వాలంటూ రోడ్డెక్కారు. బుధవారం సుందరయ్య సర్కిల్ లో ఉల్లి రైతులు రాస్తారోకో చేశారు. ఉల్లి పంటకు న్యాయమైన ధర ఇవ్వాలని, వ్యాపారస్తుల సిండికేట్ అరికట్టాలని నినదించారు. ఉల్లి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. ఉల్లి ధరల విషయంలో జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర ఇచ్చేవరకు పోరాడుతామని పెద్ద ఎత్తున రైతులు నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, పది రోజులుగా ఉల్లి మార్కెట్లో ధరలు పూర్తిస్థాయిలో పడిపోయాయని వాపోయారు. రెండు లాట్లు మాత్రం గరిష్ట ధర చూపించి మిగతా 80 శాతం ఉల్లి ఉత్పత్తులను అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి కారణం మార్కెట్ యార్డ్ లో వ్యాపారస్తులు అందరూ సిండికేట్ కావడమే అని ఆరోపించారు. సిండికేట్ కావడానికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఈ విషయమై జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణాదిన ఉల్లి ఉత్పత్తి ఇక్కడే
దక్షిణాది రాష్ట్రాల్లోనే మహారాష్ట్రలోని పూణే తర్వాత అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే ఉల్లిపంట సాగవుతుంది. మార్కెట్ కు పూణే నుంచి ఉల్లి గడ్డలు ఎక్కువగా వస్తున్నందున కర్నూలు ఉల్లికి డిమాండ్ తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకుగాను పూణే గడ్డను నివారించి కర్నూలు ఉల్లి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే రైతులు అందరూ ఏకమై తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వారం రోజుల లోపల సమస్య పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, తరువాత జరగబోయేటువంటి సంఘటనలకు ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.